Subhodayam

Latest Telugu News Updates | Latest News in Telugu | Andhra Pradesh | Telangana | Political News | Health Tips in Telugu | Devotional | Cinema | Career | Life Style | Technology

అంబులెన్స్, ఫైరింజన్ కు అడ్డొస్తే రూ.10 వేలు జరిమానా

ఇకపై అంబులెన్సులు, ఫైరింజన్ లేదా ఇతర అత్యవసర వాహనాలు వెళుతుంటే తప్పకుండా పక్కకు తప్పుకోవాల్సిందే. ఉద్దేశ పూర్వకంగా అడ్డు తగిలినా, లేదంటే వాటికి దారి ఇవ్వకపోయినా వాహనదారులు రూ.10 వేల వరకు జరిమానా చెల్లించాలి. కొత్తగా అమల్లోకి రానున్న కేంద్ర మోటారు వాహనాల చట్టంలో ఈ నిబంధనను పొందుపర్చారు. ఇటీవల ఈ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే.

 

కొత్త కేంద్ర మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడితే ఇకనుంచి భారీ మొత్తంలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది. కేవలం అత్యవసర వాహనాలకు దారి ఇవ్వకపోతేనే కాదు, ఇతర అన్ని రకాల ఉల్లంఘనలకు ఇదే వర్తిస్తుంది. మరోవైపు రోడ్డు ప్రమాదాలకు 90 శాతం మానవ తప్పిదాలే కారణమవుతున్నాయి. లైసెన్సులు లేకుండానే చాలామంది వాహనాలు నడుపుతున్నారు. కొందరు కారు నడిపేటప్పుడు సీటు బెల్టు ధరించడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు బెల్టు లేక ఎక్కువ శాతం మరణాలు సంభవిస్తున్నాయి.

 

చాలా వాహనాలు పర్మిట్‌ లేకుండానే రోడ్డుపైకి వస్తున్నాయి. నగరంలో ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ పెట్టుకొనే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. హెల్మెట్ లేకుండానే బైక్ లను నడుపుతున్నారు. గత ఏడాది 15 లక్షలకు పైనే కేసులు నమోదు కావడం గమనార్హం. ఇక బీమా చేయకుండా వాహనాలు నడిపే వారూ అధిక సంఖ్యలోనే ఉన్నారు. కొత్త చట్టం ప్రకారం ఈ ఉల్లంఘనలకు జరిమానాలను భారీగా పెంచారు.

 

మైనర్లకు వాహనాలు ఇస్తే 3 ఏళ్లు జైలు శిక్ష పడుతుంది. కొందరు తల్లిదండ్రులు మైనర్లకూ వాహనాలు కొని ఇస్తుంటారు. 18 ఏళ్లు నిండి లైసెన్సు తీసుకొన్న తర్వాతే వాహనాలు నడపాలి. 9, 10 తరగతుల పిల్లలు కూడా బైకులు నడుపుతూ ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఇటీవల ఖైరతాబాద్‌లో ముగ్గురు బాలురు బైక్ పై వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లిదండ్రులు లేదంటే బంధువులు మైనర్లకు వాహనాలు ఇస్తే మూడేళ్ల జైలుతోపాటు రూ.25 వేల జరిమానా విధిస్తారు. మితిమీరిన వేగంతో వెళ్లేవారికి రూ.5వేలు వసూలు చేస్తారు. ఇప్పటివరకు మద్య సేవించి వాహనం నడిపితే రూ.2 వేల వరకు జరిమానా లేదంటే ఒకటి రెండు రోజుల జైలు శిక్ష విధిస్తున్నారు. ఇకనుంచి తాగి వాహనాలను నడిపితే రూ.10 వేల జరిమానా చెల్లించాల్సిందే.

error: నమస్కారం!