Subhodayam

Telugu News updates , Andhra Pradesh News, Telangana News, Latest News in Telugu, Telugu news today

అమెజాన్ ప్రైమ్‌, నెట్‌ఫ్లిక్స్‌లకు పోటీగా ‘ఫ్లిప్‌కార్ట్ వీడియో ఒరిజినల్స్’

Flipkart to offer original video content

ఈ-కామర్స్‌ రంగంలో దేశీయ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ తాజాగా వినోద రంగంలోకి కూడా ప్రవేశించింది. ఈ-కామర్స్‌ రంగంలో అమెజాన్‌కు పోటీ ఇస్తున్న ఫ్లిప్‌కార్ట్, వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్‌లోనూ అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్‌లకు దీటైన పోటీ ఇచ్చేందుకు సిద్దమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే ‘ఫ్లిప్‌కార్ట్ వీడియో ఒరిజినల్స్’ పేరిట వీడియో స్ట్రీమింగ్ సర్వీసెస్ ప్రారంభించింది. దిగువ, మధ్య తరగతి వినియోగదారులే లక్ష్యంగా, ఫ్లిప్‌కార్ట్ తన వీడియో కంటెంట్‌ను ఉచితంగా అందించడానికి సిద్దమవుతుంది. దీనికోసం 200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు తెలుస్తుంది. 200 మిలియన్ల మంది వినియోగదారులు తమ లక్ష్యమని చెప్పింది.

 

‘ఫ్లిప్‌కార్ట్ వీడియో ఒరిజినల్స్’కు కంటెంట్ క్రియేటర్‌గా ఆస్కార్ విజేత గునీత్ మొంగా వ్యవహరిస్తారని ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాశ్ సికారియా వెల్లడించారు. బాలీవుడ్‌కు చెందిన ప్రముఖ దర్శకురాలు ఫరాఖాన్ ‘బ్యాక్ బెంచర్స్’ పేరుతో ఒక సిరీస్ కూడా నిర్వహించనున్నారని, ఇది ‘ఫ్లిప్‌కార్ట్ వీడియో ఒరిజినల్స్’ నవంబర్ నెలలో ప్రారంభమవుతుందని చెప్పారు.

 

భవిష్యత్తులో స్టూడియో నెక్స్ట్, ఫ్రేమ్స్, సిఖ్యా ప్రొడక్షన్స్ తదితర నిర్మాణ సంస్థలతో కూడా తాము ఒప్పందాలు కుదుర్చుకుంటామని, అన్ని భాషల్లో, అన్ని కేటగిరీలలో నాణ్యమైన వీడియో కంటెంట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని ఫ్లిప్‌కార్ట్ వైస్ ప్రెసిడెంట్ ప్రకాశ్ సికారియా తెలిపారు.

 

భారత్‌లో వీడియో స్ట్రీమింగ్‌ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతోంది. ఏడాదికి 21.8 శాతం వృద్ధితో దూసుకెళ్తోంది. ఈ వ్యాపారం విలువ 2023 నాటికి రూ.11,977 కోట్లకు చేరుతుందని అంచనా. నెలవారీ చందా ఉండే వీడియో ఆన్‌ డిమాండ్‌ సర్వీసుల మార్కెట్‌ కూడా ఏటా సరాసరి 23.3 శాతం వృద్ధితో కొనసాగుతోంది. ప్రస్తుతం భారత్‌లో 34 వరకూ వీడియో స్ట్రీమింగ్‌ కంపెనీలు ఉన్నాయి. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో, నెట్‌ఫ్లిక్స్‌ వంటివి అమెరికాకు చెందినవి కాగా, జీ5, వూట్‌, ఈరోస్‌ నౌ, ఆల్ట్‌ బాలాజీ వంటివి భారత్‌కు చెందిన వాటిలో ఉన్నాయి.

Read More

ఎప్పటికప్పుడు తాజా వార్తలకోసం Allow బటన్ పై క్లిక్ చేయండి 

error: నమస్కారం!